Wednesday, September 14, 2011

రాధా రాధా మదిలోన మన్మధ బాధ



రాధా రాధా మదిలోన మన్మధ బాధ
రాత్రి పగలు రగిలించెయ్ మల్లెల బాధ
పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటేయవే
రాజా రాజా మనసైన మన్మధ రాజా
రాత్రి పగలు రగిలింది మల్లెల బాధ
నువ్వూగితే కాలాగదు
నేనాడితే నువ్వాగవు

ఈ పాట తెలుగు వారికి దుపరిచయమయిన స్టేట్ రౌడీ అనే చిత్ర కళాఖండంలోనిది. నాకెప్పుడూ అనిపిస్తుంది పురాతన కాలం నుంచి అప్పటికి ఎప్పటికి రాధని అందరూ ఒక 'మన్మధబాధా సంబంధిత కవితా వస్తువుగా చూసారు గాని ఒక మంచి మనసున్న మనిషిగా చూడలేదనిపిస్తుంది. నిజానికి రాధ ఒక దేవతా స్రీ, ఒక అవతారం, కారణ జన్మురాలు. కానీ, చాలామంది కవులకి ఒక కల్పనా పూర్విత శృంగార కవితావస్తువు. ఉత్తర భారతదేశంలో రాధా కృష్ణులకి గుడులున్నాయి, కానీ, దక్షిన భారతంలో అవి తక్కువ. అందువల్లనేమో ఈ మన్మధబాధ దక్షిన భారతంలోనే ఎక్కువనుకుంటా.

బ్రహ్మలోకం పైన వైకుంఠం, రుద్రలోకం; దానిపైన సుదర్శన చక్రం, ఆపైన గోలోకం ఉంటాయిట. ఆ లోకమే రాధాకృష్ణుల శాశ్వత నివాస స్థలం. అక్కడివే గోకులం, బృందావనం, మాధుర మండలం. ఆ గోలోకంలో రాధాకృష్ణులు ఆది దంపతులు. శ్రీకృష్ణుడు భువికి రావడంవల్ల భూమిలోకూడా మధుర, బృందావనం, గోకులం ఏర్పడ్డాయి. అక్కడ పీతాంబర ధరుడై, నెమలి పింఛం తలపై ధరించి వేణువు చేతపట్టి, రెండు భుజాలతో అలరారుతుంటాడు మేఘ శ్యాముడు శ్రీకృష్ణుడు. నిరాకారుడైన పరమాత్మే ఆ రూపంలో అక్కడ విరాజిల్లుతున్నాడు. ఆయన పక్కన విలసిల్లే హ్లాదినీ శక్తి రాధ. లక్ష్మి, దుర్గ, లలిత, శ్యామల మొదలైన మహాశక్తులందరూ ఆ రాధ అంశలు.

మునిజనమానస మోహిని యోగిని బృందావనం.
మురళీరవల్లకక ఆడిన నాగిన బృందావనం.
రాదా మాధవ గాధల రంజిలు బృందావనం.
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం.

అలాంటి గోలోకంలో రాధాకృష్ణులు ఆది దంపతులు. ఆ రాధాకృష్ణులిద్దరికీ ఒకటే ఆసనం, ఒకటే బుద్ధి, ఒకే మనస్సు, ఒకే జ్ఞానం, ఒకే ఆత్మ. వారిరువురు ఒకే పరబ్రహ్మ. భారతదేశంలో ఏ నదికైనా, అవి పురాణాల్లో ఏదో ఒక లోకం నుంచే వచ్చాయని కవులు చెప్పారు. యమున గూడా అలాగే ఈ గోలొకం నుంచి వచ్చి వుంటుందేమో?

దేవీ భాగవతం ప్రకారం గోకులంలోని రాధ పాదపద్మ దర్శనం బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభం. శ్రీదాముడు శ్రీకృష్ణుని గోలోక భక్తుడు. ఒక కారణంవల్ల రాధ, శ్రీదాముడు పరస్పరం శపించుకున్నారు. శ్రీదాముడు శంఖ చూడుడనే అసురునిగా జన్మించాడు. పాపఫలం అనుభవించాడు. రాధ కూడా భూలోకంలో పుట్టి శ్రీకృష్ణ వియోగం అనుభవించింది. రాధ నందవ్రజంలో వృషభానుడు, కళావతి అనే వైశ్యదంపతులకు కుమార్తెగా అవతరించింది. రాధ కృష్ణుని కంటే పదమూడేళ్ళ పెద్దదిట. ఆమె శ్రీకృష్ణుని పెంపుడుతండ్రియైన నందునికి చెల్లెలనీ, ఆ విధంగా కృష్ణునికి మేనత్త అనీ కొందరు అంటారు. ఈ రాధ పాత్ర వేదవ్యాసులవారి "సంస్కృత భాగవతం" లో కానీ, పోతనామాత్యులవారి "ఆంధ్ర మహా భాగవతం" లో కానీ లేనేలేదు!

రాధ సంసిద్ధౌ అనే ధాతువు నుండి రాధ అనే పదం పుట్టిందిట. ఒకవృత్తం గీసి ఆంగ్లభాషలో ఎ అనే అక్షరాని ముందు చేర్చి చదివితే ఆరాధ్‌ అనే పదం తయారవుతుంది. ఆరాధ్‌ అంటే ఆరాధన, సాధన, పొందుట, సంతోషించుట, పూజించుట అని అర్థాలు వస్తాయి. పూజ అనే సాధనను సంతోషంగా ఆచరించి సిద్ధిని పొందటాన్నే ఆరాధన అంటారని తాత్పర్యార్థంగా చెప్పవచ్చు. రాధా అన్న పదంలో దాగి ఉన్న ఆరాధ్‌ అనే పదం సగుణ ఉపాసనను, ప్రేమభక్తిని చెబుతుంది. రామతత్త్వంలో మరా అనే అక్షరాలు రామగా మారినట్టు, కృష్ణతత్త్వంలో ధారా అనే పదాలు రాధగా మారాయి.

రాధ పాత్రకు అజరామరమైన (అప?)ఖ్యాతిని ఆర్జించి పెట్టినవాడు జయదేవ కవీంద్రుడు. ఆయన తన సంస్కృతకావ్యం "గీతగోవిందం" లో రాధాకృష్ణుల ప్రణయాన్నే ఇతివృత్తంగా స్వీకరించాడు. జయదేవుని అష్టపదులు చాలా శ్రావ్యంగా, మధురాతిమధురంగా ఉంటాయి. "హరిరిహ ముగ్ధవధూ నికరే, సావిరహే తవ దీనా రాధా, ప్రియే! చారుశీలే!, ధీర సమీరే, యమునాతీరే" ఇత్యాదులన్నీ ఆ మహాకవి లేఖిని నుండి జాలువారిన అష్టపదులే! రాధాకృష్ణుల ఆరాధన దక్షిణభారతదేశంలో కన్నా, ఉత్తరభారతంలో ఎక్కువ.

మహా భారతంలోను, రాధమ్మ ప్రణయం గురించి కవుల మనస్సులు వివిధ కల్పనలు చేసాయి. రాధ ఎప్పుడూ కృష్ణుని కొసం ఎదురు చూస్తుంది కానీ, ఎవరూ కూడా, ఎప్పుడూ కృష్ణుడు రాధ కొసం ఎదురు చూసినట్లు వ్రాయలేదు. అంటే రాధా మాధవులది వన్ సైడ్ లవ్వా?

గోవిందుడు అందరివాడే. కానీ, 'గోపాలునకెంతమంది గోపికలున్నా/ గుండెలోన నెలకొన్న రాధ ఒక్కతే'ననిపించేంతగా తన అనురాగాన్ని ఆయన రాధమ్మపైనే కురిపించాడట. కృష్ణుడికి రాధ మేనత్త అనీ అంటారు. చాలామంది మగానుభావులు మేనత్తని ప్రేమించటమేమిటి ఠాట్! అది తప్పు అని అంటే, మరి మేనమామని పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి మేనత్తని ప్రేమిస్తే తప్పేమిటి, వంకాయ్?

చాలామంది కవులు ఎవడి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు రాధపై కపిత్వం వ్రాసుకున్నారు. ఎవడబ్బ సొమ్మని? రాధ ఇప్పుడు ఉంటే సూ చేసి ఉండేది. నేనే లాయర్ ని అయితే, ఫ్రీగా వాదించేవాడిని. అన్ని పుస్తకాలకి రయల్టీ నొక్కేవాడిని. కొన్నిటిని బాన్ చేసేవాడిని కూడా. అసలు జయదేవుడి శృంగార లీలలు అనే ఒక పుస్తకం వ్రాసి స్టేట్ రౌడీ లాంటి కళాఖండం పాటలతో ఒక సాంఘిక పౌరాణిక చిత్రరాజం తీసే వాడిని. సరయిన ప్రొడ్యూసర్ దొరక్క తీయలేకపొయాను.

రాధాకృష్ణులు భార్యాభర్తలై మనుగడ సాగించారా, లేక పెళ్లి చేసుకోకుండా సహజీవన యాత్రను తమ జీవితపంథాగా ఎంచుకున్నారా అనే సంగతిని పక్కనపెడితే వారూ సీతారాముల వలె, శివపార్వతుల వలె భారతీయులకు పూజనీయులే. పెళ్లికిముందు శృంగారకేళి తప్పు కాదని తీర్పునిస్తూ, ఆ సందర్భంగా 'రాధాకృష్ణులదీ సహజీవనమే కదా' అని సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇక్కడి ప్రజానీకంలో అత్యధికులకు రుచించకపోవడానికి కారణం కూడా.

కృష్ణభగవానుని ఆత్మశక్తి రాధేనన్నది వైష్ణవ మతానుయాయుల నమ్మిక. రాధది స్వచమైన మనసు. కృష్ణ్నుడు అందరినీ ప్రేమిస్తాడని తెలిసి కూడా నిజాయితీగా ప్రేమిస్తుంది. రాధ గురించి అలోచించినప్పుడు నాకు ఆర్చీ కామిక్స్ లో బెట్టీ గుర్తుకు వస్తుంది. ;)

నాకు రాధంటే ఇష్టం. రాధకి మాత్రం కృష్ణుడంటే ప్రేమ. ఇంకేం పీకుతాను? ఆర్య సినీమాలొ హీరో లాగా. కాని కృష్ణుడెంత మాయగాడు. రాధ ఒక్కతికే కాక ఒక 16,000 మందికి ప్రేమ సమానంగా పంచి ఇస్తాడు. మనకంత సీను లేదు. పైగా కృష్ణుడు దేవుడు కూడా, లేదంటే గొడవలయిపోవూ? హెహె ఉత్తినే!

Sunday, August 21, 2011

చాతకం జిందాబాద్!

చాతక పక్షి  (ఆంగ్లం jacobian cuckoo) కోకిల జాతికి చెందిన ఒక పక్షి. ఈ పక్షి, మన సాంప్రదాయం ప్రకారం కేవలం తొలకరి వర్షపు నీటినే తాగుతుంది.

అప్పటి వరకూ వేరే నీరు ముట్టదు. దీక్షకు, వేచి ఉండే ఓర్పుకు ఉదాహరణగా ఈ పక్షిని ఉదహరిస్తూ ఉంటారు.

చాతకం మొదటి వాన చినుకులతో మొలకెత్తిన వృక్షం పైనే ఉంటుంది. తెలుగు సినిమా రిలీజు అయ్యిన మొదటి రొజు మొదటి ఆట మాత్రమే చూడాలనుకుంటుంది.

చాతక పక్షులు వాన చినుకులు తప్ప ఎంత దాహమేసినా ఇంకేవీ త్రాగవు. విస్కీ గూడా నీళ్ళు కలపకుండా ఆన్ రాక్స్ తాగుతుంది.

కాళిదాసు మేఘసందెశంలొ చాతకం గురించి ఏమన్నాడంటే,

మన్దం మన్దం నుదతి పవన శ్చానుకూలో యథా త్వాం
వామశ్చాయం నదతి మధురం చాతక స్తే సగన్ధః
గర్భాధానక్షణపరిచయా న్నూన మాబద్ధమాలాః
సేవిష్యన్తే నయనసుభగం ఖే భవన్తం బలాకాః

దీని అర్ధం

"అనగననగనగా ఒకప్పుడు ఒకానొక చాతక పక్షి పూర్వీకుడు ఎక్కడపడితే అక్కడ నీళ్ళు తాగేవాడు. అజీర్తి చెస్తే కడుపు నొప్పి వచ్చి వుంటుంది. దెబ్బకి దయ్యం వదిలి మంచి నీరు మాత్రమె తాగాలని ఒక బొడి నియమం వేసి వుంటాడు, అప్పటినుంచి తర తరాలుగా అన్ని చాతకాలు అలా అలా తొలి వర్షపు చినుకు నీళ్ళు మాత్రమే తాగేవి, ఏది పడితే అది తాగితే అజీర్తి చేస్తుందనే భయం వలన."

అందువల్ల చాతక పక్షులు వాన చినుకులను మాత్రమే త్రాగుతుంది. ఎప్పుడూ ఘనమేఘాలకై ఎదురుచూస్తుంది.

ఏమిటి, అలా అనుమానంగా చూస్తున్నారు? సరే, మరొక కాళిదాసు పద్యం వదులుతున్నా. 

అమ్భోబిన్దు గ్రహణచతురాం శ్చాతకాన్‌ వీక్షమాణాః
శ్రేణీభూతాః పరిగణనయా నిర్దిశన్తో బలాకాః
త్వా మాసాద్య స్తనితసమయే మానయిష్యన్తి సిద్ధాః
సోత్కన్ఠాని ప్రియసహచరీ సంభ్రమాలిఙ్గితాని

దీని అర్ధం ఏమిటంటే

"నిజంగా ప్రపంచానికి కవిత్వమే కావలిస్తే ఇంతకంటె అదను లేదు. సాహసీ! నీ సందేశం కోసం విశ్వం తన చాతక వదనం తెరుచుకున్నది. నీ గానానికి మా వీణా తంత్రుల శ్రుతి సవరిస్తున్నాము. తలుపులన్నీ వివృతం చేసి ఉంటాము. నువ్వు రావాలి. రావా లి.... నువ్వు ఎప్పుడు వస్తావో! ఎలాగ వస్తావో! నువ్వు సైక్లోన్ లాగో, సల్ఫూరిక్ ఆసిడ్ లాగో గంధ సింధూరం లాగో గండ భేరుండం లాగో రావోయ్! రావోయ్! యువకవీ!! నవకవీ!!''

ఏమిటి, మళ్ళీ అలా అనుమానంగా చూస్తున్నారు?
ఇదేమిటి, కాళిదాసు ఇంగ్లీషు లొ రాసాడేమిటనుకుంటున్నారా, అబ్బే, చెప్పానుగా, కాళిదాసు, శ్రీశ్రీ గారు ఎమీ అనుకొరని.   హిహి

ఇప్పుడో చిన్న పిట్ట కధ.

"ఒక బోయ వాడు అరణ్య మార్గాన వెళుతూంటే ఆతనికి రెండు చాతక పక్షులు ఆకసాన ఎగురుతూ కనబడినవి.
ఆ బోయవాడు తన అంబుల పొదినించి బాణాన్ని అందుకుని గురి చూసి బాణం ఎక్కు పెట్టి, వదిలాడు. ఆ రెండు చాతక పక్షులలో ఒకటి ఆ బాణ ఘాతానికి మృతి చెంది నెల వ్రాలినది.
ఆ రెండవ చాతక పక్షి ఆకసాన వృత్తాకారం లో తిరగసాగింది. ఈ మారు బోయ వాడు మరో బాణాన్ని ఆ రెండో పక్షి పై ఎక్కు పెట్టాలని బాణం కోసం అంబు ల పొది లో చెయ్యి పోనివ్వగా అతనికి ఖాళీ పొది కాన వచ్చింది.
ఆ బోయవాడు ఇక చేసేది లేక  'లేని బాణం' తో ఈ మారు విల్లు ఎక్కు పెట్టాడు. రెండో చాతక పక్షి ' లేని బాణ ఘాతానికి'  నేల వ్రాలి ప్రాణం విడిచి పెట్టింది."

ఈ కధ లొ నీతి ఏమనుకుంటున్నారు?
.
.
.
.
.
ఆ రెండు పక్షుల్లొ ఒకటి ఆడది, ఒకటి మగది, అందువల్ల లవర్ చచ్చిపొతే రెందవదికూడ చనిపోయిందని రొమాంటిక్ గా అలొచించారా? పప్పులో కాలు వేసారు.
.
.
ఆ బాణం వేసింది రజనీకాంత్. ఒక్క బాణం వేస్తే వంద బాణాలు వేసినట్లే. అందుకే రెండూ చచ్చిపొయాయి. 

అసలు మయాబజార్ సినిమాలొ ఘటొత్కచుడి కిరీటం పైన ఈకలు ఎవరివనుకున్నారు?మన చాతకం పక్షి ఈకలే మరి. అసలు ఘటొత్కచున్ని కిరీటం పైన ఈకలు లెకుండా ఊహించుకొండి, అబ్బే, లేకపొతే మయాబజార్ హిట్టు అయి వుండేదే కాదు.      

చాతకం జిందాబాద్!


Friday, July 22, 2011

సభకు నమస్కారం!

హమ్మయ్య !

నేను సైతం ఓ బ్లాగు తెరిచానోచ్ !
ఇన్నాళ్లూ నేను ఒక్కడినే వేరే వాళ్ళ బ్లాగులు చదివి బాధ పడి పడి లేచి కుళ్ళుకుని నేను కూడా ఓ శుభముహూర్తంలో  బ్లాగు తెరిచి రివెంజి తీసుకున్నా! హహహహహహహః...  !